Love Letter 19
Written By Bhanuchandara
ఆఫీస్ లో పని చేస్తూంటానా సడెన్గా నువ్వు గుర్తొచ్చి కలవర పడ్తుంటాను.
షాపు కెళ్ళి నాక్కావల్సిన వస్తువులు కొనుక్కున్నాక నీకు కావాల్సిన వస్తువులు సెలెక్ట్ చేస్తుంటే నువ్వు లేవన్న నిజం గుర్తొచ్చి బేలగా అయిపోతాను.
నీ నుండి నీ ఆలోచనల నుండి తప్పించుకుందామని ఉరి చివర ఉన్న గుడికి వెళ్ళాను.
అక్కడ గర్భగుడిలో చిరునవ్వులు చిందిస్తూ స్వామి. స్వామి పక్కన అమ్మవారు. చుట్టుపక్కల చుస్తే... ఒక్క నేను మినహా..అన్ని జంటలే. ఆఖరికి పక్షులు కూడా జంటగానే ఉన్నాయి. ఒంటరితనంతో ఉండలేక ఎంత వేగముగా వెళ్లానో అంతే వేగముగా వెనక్కి వచ్చాను.
అమ్మ నాన్నల దగ్గర కూచొని ఏదో మాట్లాడుతుంటానా..! అకస్మాతుగా వాళ్లిదరు చిన్న విషయములో దెబ్బలాడుకుని అంతలోనే ముసిముసినవ్వులు నవ్వుతుంటారు. అదిగో ఆ సమయాన నువ్వు గుండెలో దూరి నా గుండె మరింత గాయం చేస్తావు.
వీకెండ్ ఎంజాయ్ చేద్దామని వెళ్తానా ..అంతమందిలో నువ్వు గుర్తొచ్చి దిగులు ఆవహిస్తుంది.
చాల మంది అర్ యు సింగల్ అంటుంటే..అవును కాదులా మధ్య మనసు నలిగిపోతుంది. నువ్వున్నావని ఎలుగెత్తి చాటాలన్పిస్తుంది..అంతలోనే ఎక్కడున్నావో తెలియని నిన్ను తలచుకొని ఏడుస్తూ దుఃఖంలో మునిగిపోతుంటాను.
అప్పట్లో స్వార్ధములో నేను.
ఆ నేను లో నువ్వు కలగలిసి మనిద్దరం ఓ ప్రపంచం అని శ్వాసించాను.
నా ప్రపంచములో నాకిక తిరుగే లేదనుకున్నాను.
నేను అనే నా గర్వాన్ని..నా ప్రపంచమనే అతిశయాన్ని తునాతునకలు చేసింది నీ ఎడబాటు.
ఎస్ నేను ఒంటరి...నువ్వు ఒంటరి
సూరీడు ఒంటరి ...చంద్రుడు ఒంటరి
ఏడుపు ఒంటరి....నవ్వు ఒంటరి
విశ్వాసం ఒంటరి...అవిశ్వాసం ఒంటరి
నడక ఒంటరి ....పరుగు ఒంటరి
దుఃఖం ఒంటరి...మోదం ఒంటరి
రాత్రి ఒంటరి...పగలు ఒంటరి
జననం ఒంటరి....మరణం ఒంటరి
పడుతూ లేస్తూ ..లేచి పడుతూ ఒంటరిగా జీవించడమేనా! జీవితం.
ఒంటరిగ ఉంటూ ఒంటరిగా జీవించలేమా
నువ్వు లేకపోయినా నేను మనగలను.
సవాలు చేసి చెప్తున్నాను...
నువ్వు గుర్తొస్తేనా! ఏడు సముద్రాలూ నిండేలా...గుండెలు పగిలేలా ఏడుస్తాను
మౌనినై నీ ధ్యానములో మునిగిపోతాను.
అప్పుడప్పుడు నను నేను సముదాయించుకుంటూ సంద్రపు సంగీతం వింటూ నీకై నిరీక్షిస్తాను.
Comments
Post a Comment