Love Letter 26
Written By Bhaanuchandara
నిరీక్షణ...నిరీక్షణ..నిరీక్షణ
నీకోసం నిరీక్షిస్తూ ఉదయం నుండి బంజారాహిల్స్ కాఫీడేలో వెయిటింగ్....
నిన్న వాణి కలిసినప్పుడు చెప్పింది నువ్వు కాఫీడే కు ప్రతి రోజు వస్తున్నావని.
నిన్ను చూసి చాల రోజులైంది కదా! ఆగలేక..పొద్దున్న పది గంటలకు వచ్చి కూచున్నాను.
నువ్వు కలుస్తావన్న ఊహ నా మనసులో మరింత సందడి..సందడి చేస్తుంటే కొంచెం అందముగా కనపడాలని రాత్రి బ్యూటీ పార్లర్ కెళ్ళి నా కేశాలను ఫైన్ బ్యాంగ్స్ హైర్డో చేయించుకున్నాను.
నువ్వు ఎలా ఉన్నవో..సన్నబడ్డావో..లావయ్యావో...అఫ్కోర్స్! నువెలా ఉన్నా..నువ్వు హీరోవే..నువ్వు నా వాడివే.
మధ్య మధ్యలో కాఫీ తాగుతూ..ఫోన్ లో నీ ఫోటోలు చూస్తూ..నీ వదనంలో దాగిన అమాయకపు కళ్ళలోని వెన్నెల గ్రోలుతూ నాలో నేను నవ్వుకుంటున్నాను.
అంతలోనే బ్రాంతి నుండి బయటపడుతూ నువొచ్చావేమోనని చుట్టూ చూస్తుంటే..నన్నేదో పిచ్చిదాన్ని కింద జమ కట్టి వింతగా చూస్తున్న వేయిటర్స్..
ప్రేమంటే...ఇద్దరికే అర్థమై మూడోవారికి పిచ్చిగా కనపడేది కదా!
అలానే... ప్రేమంటే .. మంటే అన్న విషయం కూడా నాకిప్పుడే తెలిసింది.
మల్లి కాఫీ తాగాలన్పించింది...వెయిటర్ ను పిలిచి ఓ స్ట్రాంగ్ కాఫీ చెప్పి అమౌంట్ పే చేశాను.
నేను చెప్పినట్లే మాంచి స్ట్రాంగ్ కాఫీ తెచ్చి ఇచ్చాడు..నెమ్మదిగా సిప్ చేస్తూ..చవులూరే రుచిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.
ఆహ్...! అద్భుతమైన కాఫీని పరిచయం చేసిన అహ్మద్ ఆల్ గఫ్ఫార్కు నా మనసు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తుంటే..నా నయనాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి.
టైం చుస్తే మధ్యాహ్నం రెండయింది.
ఫోన్ లో నీ ఫొటోస్ చూస్తుంటే నువ్వు రాసిన కవిత కనపడింది.
"వడి వడిగా నీ వద్దకు నేనొస్తే
నవ్వుల మంటల్లో కాల్చేస్తూ నువ్వు
ఆశ్చర్యమవుదామని నీ దగ్గరకు నేను బయల్దేరుతుంటే
నన్ను ఆశ్చర్యపరుస్తూ నా ముంగిట ప్రత్యక్షమవుతావు
నీ ఊపిరావుదామని నేను
నా ప్రాణముగా మారిన నువ్వు
నీ హృదిలో ఆకాశమంత సంతోషమవ్వాలని నేనాశపడితే
అనంతమై నన్ను పరిమళభరితుణ్ణి చేస్తూ..చుట్టేసే నువ్వు
ప్రతి సారి నేను ఓడిపోతూనే ఉన్నాను..అయినా బాగుంది."
కవిత చదివిన నా మనసు మరింత భారముగా మారింది.
నువ్వు వచ్చావేమోనని చుట్టూ చూసాను..ఎక్కడ జాడ లేదు...
నీ కోసం నేను...ఎగిసెగిసి పడే నా మనసు...ఎగెసెగిసి పడ్తున్న ఎదను ఏమి అనలేక చీకటి నిండిన కనులకు జవాబు చెప్పలేక దిగులుగా నే చూస్తుంటే...వెయిటర్ వచ్చి కాఫీ కావాలా మేడం. అంటుంటే తెమ్మంటూ..తలూపుతూ పర్సులో నుండి అమౌంట్ తీసిచ్చాను.
కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు..కాఫీ తాగాలన్పించలేదు...సమయం రాత్రి ఏడయ్యింది.
నా కళ్ళు గుమ్మం వైపే చూస్తున్నాయి....నువిక రావని అన్పించి లేచాను..మరల అంతలోనే నేను వెళ్లిన తరువాత నువొస్తే ఎలా? అనుకుంటూ నా శరీరాన్ని చైర్ పై కుదేశాను.
టైం తొమ్మిదైంది...నువ్వు రాలేదు.
ఆకలిగా ఉంది..అలాగని ఏం తినబుద్ది కావడంలేదు.
నా మనసు నిన్నే స్మరిస్తున్న ఎవరొచ్చినా నువేనేమోనని ఆశగా ఎదురుచూస్తూ..బరువెక్కిన హృదయానికి ఏదో అర్జెంటు పని ఉండి రాలేకపోయావని సంజాయిషీ ఇస్తూ... నా అదృష్టాన్ని ఈసడించుకుంటూ....
నన్ను నేను మభ్యపెట్టుకుంటూ..కనులు మసకబారగ అలానే బయటకు వచ్చాను.

Comments
Post a Comment