Love Letter 31
Written By Bhaanuchandara
కోపమో..ప్రస్టేషనో అర్థం కానీ స్థితి.
నాకు మంచి చెప్పేవాళ్ళని..చెడు చెప్పేవాళ్ళని ప్రతిఒక్కరిని కోప జ్వాలలో దహించేస్తున్నాను.
చిన్న పెద్ద లేదు..అమ్మ లేదు ..నాన్న లేదు. అందరూ నా సన్నిధిలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతుంటే నేనేమో ఒంటరిగా...దిగులుతో నిషినై ఉంటాను.
ఒకప్పుడు ఎంత పెద్ద విషయమైనా కూల్గా వ్యవహరించే నేను..ఇప్పుడు ప్రతిదానికి చికాకుపడుతూ..చికాకుపరుస్తూ...చింతలో మునిగిపోయాను.
ఈ చింత మరింతగా నా లోపల ఉన్న అవయవాలను కొరికేస్తూ..నన్ను కొరివి దెయ్యాన్ని చేసింది.
బిగుసుకుపోయినట్లు...కాలం స్తంభించిపోతున్నట్లు..ఊపిరాడక ఉక్కిరిబిక్కరవుతుంటే... నా ఊపిరాగిపోతుందేమో! తట్టుకోలేక..వత్తిడిని భరించలేక...
ఓ గురువుగారిని కలిసి నా మానసిక పరిస్థితి చెప్పి సలహా అడిగితె ధ్యానం చేయి అని చెప్పారు..సరేనని ధ్యానం చేస్తుంటే నన్ను నేనే మింగేసే భూతములా దర్శనమిస్తుంటే భయమేసి ధ్యానం విరమించుకున్నా...
ఈ అశాంతి నిద్ర లేకుండా నన్ను కుదిపేస్తుంటే.. ఆ నిద్రలో యేవో కలలు..ఆ కలలు నాలో చేరి స్పష్టా..అస్పష్టముగా మనఃపలకముపై నీ చిత్రాన్ని ముద్రిస్తుంటే కనురెప్పల వాకిలిలో కాటుక పూసి ఎదురు చూస్తుంటాను.
నువొస్తావని....నాలోని జ్వాలను చల్లార్చుతావని...
అయినా నీకు దయ లేదు.
నువో కవివి కదా! బంగారం లాంటి రాముడ్ని క్షోభకు గురి చేసావు..చల్లని నవ్వుల తల్లి మా తల్లి సీతమ్మని అరణ్యములో వదిలేశావు.
అదేమంటే రామాయణం విషవృక్షమంటూ..రాక్షస వృక్షాలకు పాలు పోసావు.
నీ కోసం నీ కీర్తి కోసం నువ్వు ఏదైనా..ఏమైనా చేస్తావు...తిమ్మిని బమ్మిని చేస్తావు..బమ్మిని తిమ్మి చేస్తావు.
నీకు "మంచి చెడు" ఏమి లేవు.."ఉచ్చ నీచాలు" అసలే లేవు...నీతి న్యాయం అసలు పట్టవు...కావాల్సిందల్లా "పేరు ప్రతిష్ట"..చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోవటానికి ఏమైనా చేస్తావు..ఎంతగైనా దిగజారుతావు...ఎదుటివారు...నీ భావజాలపు ప్రాంగణములో కొట్టుకుంటుంటే చూసి ఓ పక్క "ఆనందిస్తూ" మరో పక్క "మొసలి కన్నీరు" కారుస్తావు.
రాతల్లో తప్ప చేతల్లో చూపించలేని దర్మం నీది..
ఈ అన్యాయాపు...అధర్మానికి ఆద్యుడు నువ్వు.
నీలోని వెదవ పైత్యానికి..భావుకత అంటూ ముసుగు తగిలించి భావుకుడిగా మన్ననలు పొందుతావు...అంతలోనే స్త్రీని నాలుగోడలనుండి బయటకు తెచ్చి వలువలు తీసేస్తావు. అదేమంటే స్వేచ్ఛ అంటూ సమర్ధించుకుంటావు.
ఒరేయ్ కవి....నిన్ను ఇష్టపడటం నాది తప్పు...నిన్ను ప్రేమించటం నేను చేసిన పెద్ద తప్పు..దీనికి ప్రాయశ్చితం లేదు.
దీనికి పరిహారంగా నిన్ను..నీ మనసును నా స్వాధీనములో ఉంచుకుంటూ నిన్ను నే..(ప్రేమ) అధికారంతో పాలిస్తాను. ఇదే నా శపధం.
Comments
Post a Comment