Love Letter 40
Written By Bhaanuchandara
నీకు గుర్తుందా !
మనిద్దరం అనంతగిరి హిల్స్ కు ట్రెక్కింగ్ కు వెళ్ళినప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన జోరున కురుస్తుంటే...దూరముగా పిడుగు పడ్డ శబ్దానికి ఒకరికొకరం మరింత దగ్గరగా చేరి..నేనేమో భయముతో నీ చేయి పట్టుకుంటే..నువేమో నీ గుండెలో భయాన్ని మోములో కనపడనీయకుండా
నన్ను మరింత దగ్గరకు తీసుకుని నా వాలుకనుల వైపు అలానే చూస్తూంటే..ఇంతలో దూరముగా నక్కల అరుపులు..మరో పక్క తీతువు పిట్ట అరుపులు మరింత భయంకరముగా ధ్వనిస్తుంటే ..ఆ శబ్దాలకు...అదిరే నా గుండెలను...స్వాంతనపరుస్తూ వీపుపై మెత్తగా సవరిస్తూ ..నీ మనోధైర్యపు ప్రసాదంలో నీ బుగ్గ మీద సిగ్గునై ఎర్రగా కందిపోతుంటే..నువేమో దరహాసాలొలికిస్తూ...మధురాతి మధురమై మనిద్దరం.
తెల్లారే సరికి ఇద్దరికీ జ్వరం..ఒకటే తుమ్ములు ఇంట్లో వారికీ ఏమైందో అర్థం కాక మనిద్దరిని గుచ్చి గుచ్చి చూస్తూ ఏమైందని అడుగుతుంటే..ఏం చెప్పాలో అర్థం కాక ఇద్దరం దొంగచూపులతో...దొర దొరగా వేగిపోతూ..తేలుకుట్టిన దొంగల్లా అక్కడినుండి చిన్నగా జారుకున్నాం.
ప్రేమంటే చిరునవ్వుల చిలకరిస్తూ..శూన్యములో చేరి... పవనమై వీస్తూ...అగ్నిలా జ్వలిస్తూ...చినుకుల మారి...అవనిలో చేరి పచ్చగా ప్రకాశిస్తూ..అమ్మ స్పర్శల మృదువుగా..మృదుమధురమై ...హృదిలో వికసించేదే....!
ఎంతైనా నువ్వు కవివి..నువ్వు వర్ణిస్తుంటే..నే..తరించాలనుంది...నేనా భావాన్ని సరిగ్గా చెప్పలేని వెర్రిదాన్ని.
వేయి కన్నులతో ఎదురుచూస్తున్నా పిచ్చిదాన్ని...కరుణిస్తావని....కనికరిస్తావని..ప్రేమను పంచుతావని.
Comments
Post a Comment