Love Letter 36

 

                                                                

                                                                                        Written By Bhaanuchandara 

ఏ మాయ చేసావో ఏమో... 

మొదట్లో అతి సాధారణముగా కనిపించిన నువ్వు..రోజు రోజుకి అందముగా.. ఆనందమై నా గుండెలో ఒదిగిపోయావు. 

ఒక్కరోజు నువ్వు కనపడక పొతే..నా మది నిండా నైరాశ్యం అలముకునేది..

నేనెక్కువగా నీ గురించే ఆలోచించటంవల్ల నా మనసిలా తపిస్తుందేమో అనుకునేదాన్ని.

నా మీద నాకు కొంచెం విశ్వాసం ఎక్కువ..నేనేమిటి? పడటమేంటి? ప్రేమేంటి? ప్రేమించడమేంటి? ప్రేమ అనేది..  కవులు కల్పించే అభూత కల్పనగా భావించిన నేను....

నీ ప్రేమలో పడిపోయానని తెలుసుకోటానికి నాకు ఎన్నో రోజులు పట్టలేదు. ఓ రోజు నేను ఆఫీస్  కు వెళ్తుంటే నువనుకుని వేరే ఎవరినో పలకరిస్తుంటే వాళ్ళు నన్ను ఎగాదిగా చూస్తుంటే నాకప్పుడు అర్థమైంది. నేను ఏదైతే కల్పనగా అనుకున్నానో...ఆ కల్పనలో...నీ ప్రేమలో పడిపోయానని.            

ఇంత పెద్ద విశాల దేశములో నువెందుకు నచ్చావో..నిన్నెందుకు మెచ్చానో నాకిప్పటికీ అర్థం కాదు.

బావ అంటూ సరసముగా వరస కలిపి..నిను చుట్టేయాలని తహతహలాడుతున్నా

మరదలు పిల్ల అంటూ వరదై..ఉప్పెనై నన్ను కబళించే నీ చర్య కోసం ఎదురుచూస్తున్న   

ఎంతైనా నే.. ఇంతిని  కదా...నిన్ను చూడగానే సిగ్గుల దుప్పటిలో దూరిపోతున్నా.

ఎద ఎంత ఎగిసిపడిన..యవ్వనం..పూలవనమై పరిమళిస్తున్న పలకరింపుతో సరిపెట్టుకుంటున్న సంపెగని.


చూపులో చూపునై నిన్నే దోచేసుకుంటున్నా దొరసానిని.

అడుగులో అడుగులేస్తూ నీ వైపే వస్తున్నా అందాల దీపాన్ని.  

మాటలో మాటనై ..పాటల మారి హృదిలో చేరిన గులేబకావలిని.

విరజాజిపువ్వుల విచ్చుకుంటూ నిన్నక్రమించుకుంటున్న వాయువుని.   


నువ్వు అందగాడివా అంటే కాకపోవచ్చు..అందరుమెచ్చె పర్సనాలిటీ...దేహదారుఢ్యం వగైరా వగైరా లేకపోవచ్చు.

నా మనసు దోచిన నెలరాజువి. 

నవ్వి నవ్వని నీ లేత నవ్వులో ముత్యాలే దొర్లుతాయో...పగడాలే కురుస్తాయో కానీ చూస్తూ నే...చిత్తరువునైపోతాను.               

వెన్నెలను వర్షిస్తూ నీ కనులు నను చుట్టేస్తు...గుండెల్లో చేరి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే  ఊపిరాడక  నిను గాఢముగా చుట్టేయాలనిపిస్తుంది.


ఈ అనంతమైన ప్రేమను మాటల్లో..వ్యక్తీకరించలేని పేదదాన్ని        

ఆరడుగుల బక్కపలచని మనిషివే కానీ విశ్వమంతా నిండి వివిధ వర్ణాలతో రంజింపచేస్తునావు. 


      ఓ ప్రాణ నాధా..నీ కోసమే నేను...నా కోసమే నువ్వు. 

నా చిరునవ్వుల పూల మాలను గుమ్మములో కట్టి నీ కోసం ఎదురుచూస్తున్న.........        


Comments

Popular posts from this blog

Love Letter 30

Love Letter 29

Love Letter 27